అమ్మా ఇందిరమ్మా…. మా కోసం మళ్ళీ జన్మించి మా చమైక్యతను కాపాడు తల్లీ….!

అమ్మా ఇందిరమ్మా…. మా కోసం మళ్ళీ జన్మించి  మా చమైక్యతను కాపాడు తల్లీ….!

అమ్మా!
ఇందిరమ్మా!

మా తెలుగు తల్లిని కన్న తల్లివి
మా అమ్మవు అమ్మమ్మవు
యావత్‌ తెలుగు జాతికే ఇలవేలుపువు నువ్వే నమ్మా !

1969లో విరుచుకు పడిన ప్రత్యేక తెలంగాణా తుఫాన్‌ను ధీటుగా ఎదుర్కొని
చెన్నారెడ్డి లాంటి మత్తగజాన్ని లొంగదీసుకుని
369 మంది తెలంగాణా యువకుల్ని బలితీసుకుని
మా చమైక్యతను…… మహోన్నత ప్రజాస్వామ్య స్పూర్తిని
కాపాడిన ధీరోదాత్తురాలివమ్మా నువ్వు.

1972లో అంతకంటే పెద్ద ఎత్తున ముంచెత్తిన జై ఆంధ్ర సునామీని కూడా ధీటుగా ఢీకొని
తెలంగాణా ఉద్యమ సమయంలో
”తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది” అన్న
ఎన్‌టిరామారావు సైతం ” రెండుగ వెలుగు జాతి ” అని స్వరం మార్చి పాడినప్పటికీ
వినకుండా దాదాపు 400 మంది సీమాంధ్ర యువతను బలితీసుకుని
మరోసారి మమ్మల్ని చీలిపోకుండా కాపాడిన ఆదిపరాశక్తివమ్మా నువ్వు.

అస్సాంని చీల్చావు,….
చచ్చినా ఒప్పుకోనన్న పంజాబ్‌ను సైతంఅసెంబ్లీని రద్దుచేసి మరీ చీల్చావు…

ఏ ప్రధాన మంత్రీ ఏర్పాటు చేయనన్ని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశావు…. !అయినా ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం ససేమిరా చీల్చనన్నావు

హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని
నైజాంనవాబు ఐక్యరాజ్యసమితికి చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో వున్న కారణంగానే
తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించావని గిట్టని వాళ్లు అంటారు,

లేకపోతే అన్ని రాష్ట్రాలను ముక్కలు చెక్కలు చేసిన నువ్వు
మీ నాన్న అయిష్టంగా అతుకుపెట్టిన తెలంగాణాంధ్ర ప్రదేశ్‌ను
దేనికదిగా విడదీస్తే దేశ సమైక్యత దెబ్బతింటుందని ఎలా అనుకుంటావు తల్లీ.

కారణం ఏదైనా మా చమైక్యతను కాపాడిన కల్పతరువువు నువ్వే నువ్వే నువ్వే నమ్మా!

ఇప్పుడు నువ్వు లేవు కాబట్టే
కెసిఆర్‌ అనే ఒక బక్కన్నను, ముక్కు తిమ్మన్నను మేనేజ్‌ చేయడం చేతకాక

పోలీసుల చేత ఉద్యమ కారుల్ని చంపించడం చేతకాక,….
రెండు ఉప్పెనలప్పుడు పోలీసు కాల్పుల్లో చనిపొయిన వారి కంటే అధికంగా
ఓ 1200 మంది తెలంగాణా యువతీ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్న
చిన్న సాకుతో …. ఆంధ్రప్రదేశ్‌ను …తద్వారా యావద్దేశాన్ని…..తద్వారా యావత్‌ ప్రపంచాన్ని …..
ప్రజాస్వామ్య విరోధులు,

రాజ్యాంగ ద్రోహులు ముక్కలు చ్కెలుగా …చెక్క ముక్కలుగా చేయాలనుకుంటున్నారమ్మా

అందుకే
నువ్వే మా కోసం మరో జన్మెత్తి మా చమైక్యతను కాపాడాలి తల్లీ.

కొంపదీసి ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో
నైజాం నవాబు దరఖాస్తు కొట్టివేయబడింది కాబట్టి
నువ్వు కూడా తెలంగాణాను
మా కబంధ హస్తాలనుంచి వేరుచేస్తావా?

అంతా నీ దయ – మా ప్రాప్తం తల్లీ..!

Image

Image

Image

Posted in Telangana | Tagged , , , , | 3 Comments

ఎన్నటికైనా తప్పని రాష్ట్ర విభజనని ఇప్పుడే కానిస్తే పోలా? తిగుళ్ల కృష్ణమూర్తి గారు ఆంధ్ర జ్యోతిలో

తిగుళ్ల కృష్ణమూర్తి గారు ఆంధ్ర జ్యోతిలో (25 10 2013న) రాసిన ఆద్భుత వ్యాసం
తప్పక చదవండి … చదివించండి … చదివి ఆలోచించండి !

అబద్ధంవా.. సుబద్ధంవా…

– తిగుళ్ల కృష్ణమూర్తి

2014 దాకా విభజనను ఆపాలని సీమాంధ్ర నాయకులు కోరడంలోనే, అప్పటికి ఎన్నికల్లో గెలిచి, పబ్బం గడుపుకుందామనే ఎత్తుగడ దాగి ఉంది. 2014 దాకా విభజనను ఆపుతామని, తర్వాత గ్యారెంటీ లేదని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఇంతోటిదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇన్ని అబద్ధాలతో సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం ఎందుకు? ఎన్నటికైనా తప్పని విభజనను ఎప్పుడో ఒకసారి కానిస్తే పోలా?!

మోసపోవడం ఒక బలహీనత.

మోసం చేయడం ఒక అవసరం.

ఈ అవసరాన్ని అలవాటుగా మార్చుకున్న వారు ‘ఫలానా వారిని’ మాత్రమే మోసం చేస్తారనే రూలేం లేదు. మోసకారులకు స్వపర భేదాలుండవు, స్వార్థం తప్ప!

రాష్ట్ర విభజన అంశంలో కొందరు సీమాంధ్ర నాయకుల మాటలు, ఆటలు ఒక్కసారి గమనించండి.

వెయ్యేళ్లయినా ఈ రాష్ట్రం విడిపోదని జాతీయ జెండా సాక్షిగా ప్రకటించారు.

విభజన ప్రకటన వచ్చింది.

దేవుడు కూడా తెలంగాణ ఇవ్వలేడన్నారు.

సోనియా ఇవ్వాలని నిర్ణయించింది.

అది పార్టీ నిర్ణయం మాత్రమే అన్నారు.

యూపీఏ తీర్మానం చేసింది.

తమ రాజీనామా బెదిరింపుతో ప్రక్రియ ఆగిపోయిందన్నారు.

కేబినెట్ నోట్ రెడీ అయింది.

విభజనపై కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు.

జీవోఎం ఏర్పాటైంది.

ఇక ముందుకు కదలదని శాసించారు. రాష్ట్రం నుంచి సమాచార సేకరణ మొదలైంది. విభజన తీర్మానం అసెంబ్లీ పరిశీలనకు వస్తుందన్నారు. తీర్మానం ఉండదని షిండే, డిగ్గీరాజా ప్రకటించారు. వారట్లా జరగదని అనడం.. రోజులు గడవక ముందే అక్షరం పొల్లుపోకుండా అదే జరిగిపోవడం. దీన్ని వాక్శుద్ధి అనాలా? వంచనా శిల్పం అనాలా?

ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబు అన్నట్టు ‘రాజ్యాంగం తెలియని వారు’ నాయకులు కావడం మన దురదృష్టం. ఇంత జరిగిన తర్వాత కూడా సదరు సీమాంధ్ర నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థంకాదు.

వారేమంటున్నారు? అసెంబ్లీలో బిల్లు ఓడిపోతుంది. దాంతో విభజన ప్రక్రియ ముందుకు సాగదు. దీంతో సోనియా పార్లమెంటుకు బిల్లు పంపడానికి సిగ్గుపడుతుంది. పంపినా మద్దతివ్వడానికి బీజేపీ భయపడుతుంది. మద్దతిచ్చినా సంతకం పెట్టడానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జంకుతారు. ఆయన ఆపకుంటే తామే ఆర్టికల్ 371డిని అడ్డుపెట్టి, సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటాం! ఇదీ వారి తర్కం.

తెలంగాణకు మెజారిటీ లేని, రప్పించడం ఎన్నటికీ సాధ్యంకాని ఉమ్మడి అసెంబ్లీలో తీర్మానమో, బిల్లో గెలిచే అవకాశాలు అతి తక్కువ అన్న సంగతి విభజనకు నిర్ణయించిన సోనియాకు, మన్మోహన్‌కు ముందు తెలియదనుకోవాలా?

అయినా వాళ్లు ముందుకు వెళ్లడానికి కారణం.. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయానికి విలువ నామమాత్రం కావడమే. అది అనుకూలమైనా, ప్రతికూలమైనా దాన్ని పట్టించుకోవాల్సిన నిమిత్తం కేంద్రానికి ఎంతమాత్రం లేదు. సీమాంధ్ర నేతల కన్నా మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివైన వారు.

అన్ని విషయాలకూ ‘మెజారిటీ’ అభిప్రాయాన్నే ప్రాతిపదికగా చేస్తే, ఈ దేశంలో ‘కుల, మత, ప్రాంతీయ మైనారిటీ’ల కోరికలు ఎన్నటికీ తీరవు. వారికి హక్కులివ్వడానికి మెజారిటీ ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఆయా సందర్భాల్లో మెజారిటీ అభిప్రాయానికన్నా న్యాయాన్యాయాల విచక్షణకే పెద్దపీట వేశారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాగూ ఓడిపోయే బిల్లు, ఓడిపోయినప్పుడు సోనియా సిగ్గుపడి, మనసు మార్చుకుని వెనకడుగు వేస్తుందా?
ఇక పార్లమెంటులో బీజేపీ సంగతి. ఈ దేశంలో ఎంతోకొంత మాటకు కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ. సదరు నాయకుల్లా పూటకో మాట మార్చే అలవాటు, అవకాశం జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఉండవు. చిన్న రాష్ట్రాలను పార్టీ విధానంగా తీసుకున్న బీజేపీ, తెలంగాణపై నిర్ణయాన్ని మార్చుకోవాలంటే సంఘ్ నుంచి మొదలుకుని కిందిస్థాయి దాకా ఎంతో చర్చ జరగాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌లో లాగా బీజేపీలో అర్ధరాత్రి, ఒకరిద్దరు కూర్చుని నిర్ణయాలను తలకిందులు చేయడం అసాధ్యం.

ఇక పార్లమెంటు విభజన బిల్లు పాస్ చేసినా రాష్ట్రపతి ఆపేస్తారనేది మరో అసంబద్ధ వాదన.

2004లో టీఆర్ఎస్‌తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ తెలంగాణ అనుకూల విధానం తీసుకున్నపుడు ప్రణబ్ రాష్ట్రపతి కాడు. ఆయనకు తెలిసే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఇప్పుడు కూడా ప్రణబ్‌కు చెప్పకుండా సోనియా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని అనుకోగలమా?

ఘటనాఘటన సమర్థుడు, పూర్వాశ్రమములో అనేక మాయోపాయముల ఆరితేరిన రాజకీయ యోధుడు, గాంధీ కుటుంబానికి 60 ఏళ్ల అచంచల విధేయుడు, రాహుల్‌కు గురుతుల్యుడు అయిన ప్రణబ్, తనను అత్యున్నత స్థానానికి చేర్చిన సోనియా నిర్ణయాన్ని వ్యతిరేకించి, సీమాంధ్ర నేతలు చెప్పినట్టు, వారికి నచ్చినట్టు చేస్తారా? ఒకవేళ విభజన బిల్లును ఒకసారి ఆయన వ్యతిరేకించినా, కేంద్ర కేబినెట్ రెండోసారి పంపితే ఆమోదించక తప్పని రాజ్యాంగ అనివార్యత రాష్ట్రపతిది. జీవితమంతా రైజానా హిల్స్‌వద్దే పెరిగి, తిరిగిన ప్రణబ్‌కు ఈ విషయం తెలియదనుకోగలమా?

విభజన విషయంలో సంప్రదాయాలను పాటించడం లేదని, రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని సీమాంధ్ర నేతలు అంటున్నారు. నిజానికి ఈ రెండూ పరస్పర విరుద్ధ వాదనలు.

సంప్రదాయాలను పాటించడం ఎల్లవేళలా సాధ్యంకాదు. అవసరమైనపుడు ‘సంప్రదాయాలను సృష్టించాల్సి’ ఉంటుంది కూడా! సృష్టించనిదే సంప్రదాయాలు (ప్రిసిడెంట్స్) ఎలా ఏర్పడతాయి! విభజన విషయంలో రాజ్యాంగం ప్రకారం నడవాలి అంటే… ఇక అసెంబ్లీ తీర్మానం ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే ‘అసెంబ్లీ తీర్మానం చేయాలని’ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. బిల్లు ముసాయిదాపై అభిప్రాయం చెబితే చాలు. అందువల్ల అసెంబ్లీని బైపాస్ చేయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అన్న వాదనే అర్థరహితం.

ఎస్సార్సీ ప్రకారమే కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలన్నది సీమాంధ్ర నేతలు చేస్తున్న మరో డిమాండ్. ఆ లెక్కన చూస్తే, నాడు మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్రా ఎస్సార్సీ ప్రకారం రాష్ట్రం కాలేదు.

తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయితే ఏకంగా మొదటి ఎస్సార్సీ అభిప్రాయానికి విరుద్ధంగా జరిగింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?

రాజ్యాంగంలోని 371డి అధికరణం కారణంగా విభజన ఆగిపోతుందనేది మరో వాదన. మన రాజ్యాంగం పదాల్లో ఎంత ప్రజాస్వామికంగా కనిపిస్తుందో, వాక్యాంతరాల్లో (బిట్విన్ ద లైన్స్) అంత నిరంకుశమైనది. అది ఎంత సరళమైనదో (ఫ్లెక్జిబులో), అంత కఠినమైనది కూడా. ఎమర్జెన్సీ మొదలుకుని, రాష్ట్ర ప్రభుత్వాల రద్దుదాకా, రిజర్వేషన్ల కొనసాగింపు మొదలుకుని, క్యాపిటలిస్టు ఆర్థిక సంస్కరణలదాకా, అది అక్రమమైనా, సక్రమమైనా, అధికార పక్షం తీసుకున్న ఏ నిర్ణయాన్ని రాజ్యాంగం అడ్డుకోగలిగింది?

మన రాజ్యాంగంలో సమాఖ్య తత్వం ‘స్ఫూర్తి’ మాత్రమే. పూర్తిగా ఉన్నది ‘బలమైన కేంద్ర’ భావనే. దేశంపై ఢిల్లీ అధిపత్యాన్ని ప్రకటింపజేసే, హస్తిన అధికారాన్ని సుస్థిరం చేసే అన్ని సందర్భాల్లో ఢిల్లీలోని అన్ని విభాగాలూ, కాంగ్రెస్, బీజేపీ ఏకమవుతాయి. పరస్పరం సహకరించుకుంటాయి. ఢిల్లీ అధికారాన్ని ప్రశ్నించే ఏ అంశాన్నీ రాజ్యాంగమో, సుప్రీంకోర్టో, రాష్ట్రపతి భవనో, చివరికి సైన్యమో ఎంతమాత్రం ప్రోత్సహించదు. అనేక సందర్భాల్లో రుజువైన సత్యమిది. కావాలంటే చరిత్ర చదువుకోవచ్చు.

చాలా ఏళ్లుగా ప్రజలతో సంబంధాలు తెగిపోవడం వల్ల కాబోలు… ఎప్పుడూ సూటిగా, దీటుగా, ధాటిగా మాట్లాడే సీమాంధ్ర నేతల మాటల్లో ఈసారి ఎంతో గందరగోళం కనిపిస్తోంది. (తెలంగాణ) ఉద్యమాల ఆధారంగా ప్రాంతాలను విభజించకూడదు అన్నవారే, (సీమాంధ్ర) ఉద్యమం చూసైనా ప్రాంతాలను కలిపి ఉంచాలంటున్నారు.

అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కాగితాలు రాసిచ్చినవారే, తమకు చెప్పకుండా నిర్ణయం తీసుకుందని అభ్యంతర పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ విషయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ప్రామాణికంగా తీసుకోవాలన్నది వారి మరో వాదన. ఇప్పుడు తీసుకున్న పరిష్కారమూ నివేదికలోనే ఉందన్న సంగతిని వారు మరుస్తున్నారు.

విడిపోతామన్న వారిని, ‘ఛస్తే కుదరదు… కలిసే ఉండాలి’ అని సీమాంధ్ర ఎంపీలు అనడం ప్రజాస్వామికమైనపుడు, వారిరాజీనామాలను స్పీకర్ తిరస్కరించి, ఎంపీలుగా కొనసాగాల్సిందేనని ఆదేశించడం కూడా ప్రజాస్వామికమే కదా!

ఐదేళ్ల కాలానికి తన ప్రతినిధిగా ఉండాలని ఒక పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాత మధ్యలో వెళ్లిపోయే హక్కు వారికి ఉన్నప్పుడు, విడిపోయే హక్కును ముందే పొంది ఉన్న ఒక ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం నుంచి వైదొలగడం తప్పవుతుందా?

‘రాజకీయ కారణాలతోనే సోనియా ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నది’ వారి మరో ఆరోపణ. రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం కాకుండా రామరాజ్యం కోసం రాజకీయాలు చేస్తాయా?

తెలుగుజాతి సమైక్యంగా ఉంటేనే ఒక వెలుగు వెలుగుతుందని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారు. సమైక్యంగా 60 ఏళ్ల ప్రస్థానం సాగించాం. మరి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ప్రతి జెండా పండుగ రోజునా ఎర్ర కోట వద్ద దండ వేయించుకోగలిగామా? దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతం అమలుకు కారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములును జాతీయ నేతగా స్మరించుకునే ఏర్పాటు చేసుకోగలిగామా?

తెలుగుతెలుగో అని పలవరించిన ఎన్టీఆర్‌కు అందరికన్నా ముందు పార్లమెంటులో విగ్రహం పెట్టించుకున్నామా? దేశానికి ఆర్థిక జవసత్వాలు కల్పించిన పీవీ నరసింహారావుకు ఢిల్లీలో కనీసం సమాధి అయినా కట్టుకోగలిగామా? అతి పురాతనమైన తెలుగుకు అన్నింటికన్నా ముందు ప్రాచీన భాష హోదా తెచ్చుకోగలిగామా? ఆలమట్టిని ఆపగలిగామా? బాబ్లీని బద్దలు కొట్టగలిగామా? పట్టుమని నలుగురు తెలుగు జాతీయ మహా నేతలకు సముచిత సంస్మరణ కూడా సాధించుకోలేని సమైక్యం రాష్ట్రం, అన్ని ప్రాంతాల ప్రజలకు భరోసా ఇస్తుందనడం ఎలా నమ్మశక్యం?

2014 దాకా విభజనను ఆపాలని సీమాంధ్ర నాయకులు కోరడంలోనే, అప్పటికి ఎన్నికల్లో గెలిచి, పబ్బం గడుపుకుందామనే ఎత్తుగడ దాగి ఉంది.

2014 దాకా విభజనను ఆపుతామని, తర్వాత గ్యారెంటీ లేదని వారు బహిరంగంగానే చెబుతున్నారు.

ఇంతోటిదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు?

ఇన్ని అబద్ధాలతో సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం ఎందుకు?

ఎన్నటికైనా తప్పని విభజనను ఎప్పుడో ఒకసారి కానిస్తే పోలా?!

తిగుళ్ల కృష్ణమూర్తి

ఆంధ్ర జ్యోతి 25 10 2013 సౌజన్యంతో

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2013/10/25/ArticleHtmls/25102013006007.shtml?Mode=1

Image

Posted in Telangana | Tagged , , , | 18 Comments

తెలుగు వీర లేవరా…”ఆ మరణ దీక్ష ” చేయరా…. !

తెలుగు వీర లేవరా…”ఆ మరణ దీక్ష ” చేయరా…. !

Image

బెంగాలీ వాళ్లు ఇవాళ ఆలోచించింది.. మిగతా దేశమంతా రేపు ఆలోచిస్తుంది…అనేవాళ్లు ఒకప్పుడు.
దానిని కొద్దిగ సవరిస్తే ‘తెలంగాణ వాళ్లు నిన్న ఏం చేశారో సీమాంధ్ర వాళ్లు ఇవాళ అది చేస్తారు’ అనొచ్చేమో.

వంటావార్పులు, గర్జనలు, మార్చ్‌లు, విగ్రహాల విధ్వంసాలు, ధూమ్‌ధామ్‌లు, సకల జనుల సమ్మెలు వగైరాలన్నీ అయిపోయి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షలు కూడా మొదలవడమే అందుకు నిదర్శనం.

కాకపోతే ఇక్కడ ఉక్కు పాదాలు, లాఠీలు, టియర్‌ గ్యాసులు, రబ్బర్‌ బుల్లెట్లు, అరెస్టులు, క్రిమినల్‌ కేసులు, నిషేధాజ్ఞలు, ప్రభుత్వమే రైళ్లను బస్సులను రద్దు చేయడాలు, బైండోవర్లు, మీటింగులకే కాదు శవయాత్రలకు సైతం పర్మిషన్ల నిరాకరణలు వంటివి అడుగడుగునా ఎదురైతే… అక్కడ ఏలినవారి ఆశీస్సులవల్ల నిరాటంకంగా, ఇస్త్రీ బట్టలు నలగకుండా భారీ సెట్టింగులతో సినిమా షూటింగ్‌ చేస్తున్నంత కోలాహలంగా ఉద్యమం సాగుతోంది.
ఇప్పుడిక ఆమరణ దీక్షల పర్వం కూడా మొదలయింది.

కెసిఆర్‌ ఆమరణ దీక్షతో తెలంగాణా ఉద్యమం శిఖరాగ్రం చేరుకుంది.
ఆయనను ఆమరణ దీక్షకు అసలు కూచోనివ్వనేలేదు.
సిద్దిపేటలోని దీక్షాస్థలానికి బయలుదేరిన వెంటనే ఆయనను కరీంనగర్‌లోనే అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి ఆఖరికి ఖమ్మం జైల్లో పడేశారు.

గాంధీ చూపిన మార్గంలో నిరాహార దీక్ష చేసే హక్కును కెసిఆర్‌కు ఎందు నిరాకరించారో ఇప్పటికీ అర్థం కాదు.

ఆయన స్థానంలో హరీష్‌రావు సిద్ధిపేటలో నిరాహార దీక్షకు కూచోబోతే ఆయనను కూడా అరెస్టు చేశారు.
పోలీసులు తనను అరెస్టు చేయడానికి దగ్గరకొస్తుంటే పెట్రోల్‌ బాటిల్‌ చూపించి దగ్గరకొస్తే ఆత్మహత్య చేసుకుంటానని  బెదిరించినందుకు ఆయనను తీవ్రంగా విమర్శించారు.
కొన్ని గ్రామ సింహాలు ”తగులబెట్టుకోడానికి హరీష్‌రావుకు అగ్గిపుల్లే దొరకలేదా” అని ఎకసక్కెం చేశారు.
కానీ ఒక్కడైనా తెలంగాణా నేతలకు శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే హక్కు కూడా లేదా
వాళ్లని ఎందుకు అరెస్టు చేశారు,
ఇదేం ప్రజాస్వామ్యం?”
అని మాత్రం ప్రశ్నించలేదు.

ప్రభుత్వ నిఘాలో వుంటూ, జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను
నానా రకాలుగా, దుర్మార్గంగా,  అవహేళన చేశారు.

కానీ ఇప్పుడు చూడండి…

సీమాంధ్రలో ఎంతమంది
ఎన్ని జిల్లాల్లో ఎంతెంతమంది ఎన్నెన్ని ఆమరణ దీక్షలు
ఎంత స్వేచ్ఛగా చేసేస్తున్నారో….!

ఒక నేత ఒక్క నెలలోనే సమన్యాయం కోసం ఒకసారి,
సమైక్యత కోసం మరొకసారి ఇలా రెండు సార్లు ఆమరణ దీక్షలు చేయడం నిజంగా న భూతో న భవిష్యతి!

అబద్ధపు వాగ్దానాలు, మాట తప్పటాలు మడమ తిప్పటాలు. యూ టర్న్‌లు. పి టర్న్‌లు, ఎస్‌ టర్న్‌లు…
ఇవేం నాయకత్వ లక్షణాలో అర్థం కాదు.

ఇంకొక నేత అయితే ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియక నేషనల్‌ మీడియా జుట్టు పీక్కుంది.

ప్రజలు…ప్రజాభిప్రాయం…ప్రజాస్వామ్యం అని తెగ డైలాగులు చెబుతున్న వారి కంటికి
తెలంగాణా ఉద్యమం ఉద్యమంగా, తెలంగాణా ప్రజలు ప్రజలుగా, తెలంగాణా ప్రజల అభిప్రాయం ప్రజాభిప్రాయంగా,
తెలంగాణా ప్రజల హక్కులు ప్రజాస్వామిక హక్కులుగా కనిపించకపోవడం శోచనీయం కాదా.

ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి
ఈ హిపోక్రసీ నుంచి, ఈ జిత్తులమారి రాజకీయలనుంచి
రెండు ప్రాంతాల ప్రజలకు నిజమైన విముక్తి లభించాలి !

Posted in Telangana | Tagged , , , | 4 Comments

మన జుట్టును మనమే ఇతర్లకి అందిస్తాం. ఆ తర్వాత అవమానిస్తున్నారంటూ మనమే అరచి గోలచేస్తాం… మంటగలసిపోతున్న తెలుగుజాతి ఆత్మగౌరవం!

మన జుట్టును మనమే ఇతర్లకి అందిస్తాం. ఆ తర్వాత అవమానిస్తున్నారంటూ మనమే అరచి గోలచేస్తాం… మంటగలసిపోతున్న తెలుగుజాతి ఆత్మగౌరవం!

” ద ప్రాసెస్‌ ఆఫ్‌ ద ఫార్మేషన్‌ ఆఫ్‌ సెపరేట్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణా విల్‌ బి ఇనిషియేటెడ్‌. ఏన్‌ అప్రాప్రియేట్‌ రెజల్యూషన్‌ విల్‌ బి మువ్డ్‌ ఇన్‌ ద స్టేట్‌ అసెంబ్లీ…”
అని చిదంబరం 2009 డిసెంబర్‌లో పార్లమెంటు సాక్షిగా ప్రకటించాడు.

దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
సమైక్యతను నిజంగా కోరుకునేవాళ్లు ఏం చేసి వుండాల్సింది ఈ నాలుగేళ్లలో?

మనం సమైక్యంగా వుందాం… జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుందాం అని తెలంగాణా ప్రజల్ని ఒప్పించి వుండాల్సింది.
రాష్ట్రం సమైక్యంగా వుండాలనుకుంటున్నట్టు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి వుండాల్సింది.

కానీ జరిగిందేమిటి…
”తెలంగాణా ఉద్యమం కొందరు రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమం.”
”కుక్కకు బొక్క వేసినట్టు ఒక మంత్రిపదవి పడేస్తే కెసిఆర్‌ ఈ ఉద్యమం లేవదీసేవాడే కాదు.”
”సీమాంధ్ర కంటే తెలంగాణాలోనే అభివృద్ధి ఎక్కువగా జరిగింది.”
”తెలంగాణా వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలు. నీళ్లలో, నిధుల్లో, ఉద్యోగాల్లో వాళ్లకు ఎలాంటి అన్యాయమూ జరుగలేదు.
సమైక్యం వల్ల సీమాంధ్ర కంటే తెలంగాణా వాళ్లే ఎక్కువ బాగుపడ్డారు.”
”తెలంగాణ వాళ్లకి భాషరాదు, నాగరికత తెలియదు. సోమరిపోతులు”
అంటూ తేరగా దొరికిన రంగు డబ్బాల ముందు
తెగ డిస్కషన్లు చేస్తూ కూచున్నారు.

కనీసం అదే చర్చను సాధికారికంగా అసెంబ్లీలో చేయడానికైనా సాహసించలేదు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీలో చర్చ జరపాలని, తీర్మానం పెట్టాలని
అనేకసార్లు అనేక రోజులు అసెంబ్లీని స్తంభింపజేసింది.
అయినా అంతా నిమ్మకు నీరెత్తినట్టున్నారు.

ఇప్పుడేమో కేంద్రం తీర్మానం కోసం ఎప్పుడు బిల్లు పంపిస్తుందా…
ఎప్పుడు దానిని ఓడిస్తామా అని ఎదురు చూస్తున్నారు.
(అధిష్టానం నిర్ణయాన్ని అధిష్టానం మొహం మీద తిప్పి కొట్టగల సత్తా ఎంతమందికి వుందన్నది వేరే విషయం).

అసలు ”తెలంగాణాకు మేం అనుకూలం… మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం” అని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం.
”తెలంగాణా తెచ్చే శక్తి మాకు లేదు. తెలంగాణాను ఆపేశక్తి మాకు లేదు. ఆర్టికిల్‌ 3 ప్రకారం మీరు బిల్లు తెస్తే మాకు సమ్మతమే.
మేం తెలంగాణా ఆకాంక్షని గౌరవిస్తున్నాం” అని ప్రకటించిన వైఎస్‌ఆర్‌ పార్టీ.
అఖిల పక్షంలో అందరిముందూ ఒప్పుకుని ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయిస్తే
ఇంక రాజకీయాలకు,

తెలుగువాడి మాట తప్పని, మడమ తిప్పని తనానికి విలువ ఏముంటుంది?

ఎవరైనా మనల్ని ఎందుకు గౌరవిస్తారు??

తెలంగాణా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఎంతో ప్రయత్నించి విఫలమైన తరువాత…
మీ దుర్మార్గపు రాజకీయ ఎత్తులకు, జిత్తులకు తల్లడిల్లి పోయి దాదాపు 1200 మంది తెలంగాణా యువత తెలంగాణా అకాంక్ష కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత.
నాలుగు నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు అచంచల పట్టుదలతో కదంతొక్కుతున్న ప్రస్తుత దశలో….

ఇప్పుడు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అని,
దానిని ఆపడం అసాధ్యం అని తేటతెల్లమయిన తరువాత కూడా…..
కాస్త హుందాగా ప్రవర్తించాలన్న స్పృహ లేకపోతే ఎవరేం చేయగలరు??

తెలుగుజాతి ఔన్నత్యం, గౌరవం సంగతి అటుంచి

మన హిపోక్రసీని చూసి యావద్దేశం అసహ్యించుకోదా?

స్వార్థ పరులు అలా చేస్తున్నారంటే వాళ్ల బాధని అర్థం చేసుకోవచ్చు
కానీ అన్నీ తెలిసిన చదువుకున్నవాళ్లు, విజ్ఞులు, వివేకులు కూడా

అదే బాటలో ఆలోచించడం నిజంగా మన దౌర్భాగ్యమే.

Image

Posted in Telangana | 8 Comments

”కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ” అయినట్టు… కొద్ది మంది బడాబాబుల బాధ మొత్తం సీమాంధ్ర ప్రజల బాధ అయిపోయింది.

ఇంకెన్నాళ్ళు ???????????

Inkennaallu 2

”కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ…
ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ …” అన్నడు చలం, ‘మహాప్రస్థానం’ ముందు మాటలో.

గట్లనే ఇప్పుడు కొద్ది మంది పెట్టుబడిదార్ల, కాంట్రాక్టర్ల, కబ్జాకోర్ల, అక్రమార్కుల బాధ –

మొత్తం సీమాంధ్ర ప్రజల బాధ అయిపోయినట్టు గొడ్తాంది. గా చాల్బాజ్‌ గాండ్లు తమ రోగాన్ని అందరికి అంటించి గత్తర లేపుతున్నరు.

ఆంధ్ర నుంచి తెలంగాణ డీమెర్జ్‌ అయితె – తమ అక్రమాలన్ని ఎక్కడ బయటపడ్తయో, తమ అధికారం ఎక్కడ మంట్లె కలిసిపోతదో అని వాళ్ల లాగులు తడుస్తుండొచ్చుగని … సీమాంధ్రల వున్న ఉద్యోగులు, కరంటోళ్లు , కార్మికులు, కర్షకులు, రైతుకూలీలు, విద్యార్థులు, రెక్కాడితె గని డొక్కాడనోళ్లు, బీదోళ్లు, ఆఖరికి బిచ్చగాళ్లు సుత ఏదో కొంపలు మునుగుతున్నట్టు గిట్ల గాయి గాయి చేసుడేందో ఏం సమజయితలేదు.

ప్రపంచపు బాధంతా తన బాధగా చేసుకున్న శ్రీశ్రీ అసొంటోళ్లు
జెర మంచీ చెడు, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం ఆలోచించె మనసున్నోళ్లు మచ్చుకైనా లేరా సీమాంధ్రల.

అంత గలిసి తెలంగాణాను ఎన్నాళ్లు దోచుకతిందామనుకుంటున్నరు?
తెలంగాణల బాంచెపు నాయకులు ఉన్నప్పుడంటే మీరు ఆడింది ఆటయింది, పాడింది పాటయింది.
”మీకు ఒక్క రూపాయి గూడ ఇయ్య … ఏం పీక్కుంటరో పీక్కోండ్లి” అని ఇంకా  మీసాలు మెలేస్తనంటె నడుస్తదా?

ఇప్పుడు తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని, మీ నేతల కపట నాటకాలని, నయవంచనని, నక్క జిత్తులను అన్ని గ్రహించింది. మస్తు అర్థం చేసుకున్నది.

అయినా తెలంగాణ ఏం అడుగుతుందిర భయ్‌?

మా బతుకు మేం బతుకుతం అంటాంది.

1956 కు ముంధున్నట్టు మీ జాగల మీరు ఉండండిర భయ్‌ అంటున్నది.

మా నీళ్లు మాగ్గావాలంటున్నది, మా నిధులు మాకు గావాలంటున్నది, మా ఉద్యోగాలు మాకు గావాలంటున్నది. మా సెక్రటేరియట్‌ మాకు గావాలంటున్నది. గంతే గద?!

అండ్ల ఏమన్న అన్యాయం ఉన్నదా? అధర్మం ఉన్నదా??

హైదరాబాద్‌ల మీరు పెట్టిన పెట్టుబడులంటరా… మీ లెక్క వాటిని ఇక్కడ ఎవ్వడు కబ్జ చెయ్యడు. మీయి మీకే వుంటయి. మీ ఆస్తులు చెన్నయ్‌ల లేవా, బెంగళూరుల లేవా? డల్లస్‌ల లేవా? ఎన్ని రాష్ట్రాలల్ల మీరు యాపారాలు చేస్తలేరు? ఓ మిమ్మల్ని కట్టుబట్టలతోని ఎవడో పొమ్మన్నట్టు గాయి గాయి చేస్తున్నరు . ఏమొ ….. కతలు పడ్తున్నరు.

ఎన్నేళ్ల సందో పోరంగ పోరంగ, పన్నెండు వందలమంది పోరళ్లు ఆత్మబలిదానాలు చేసుకోంగ ఆఖరికి కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రకటిస్తే మీరు గింత జిద్దు చేసుడేమన్న న్యాయమేనా?

జెర్రంత ఆలోచించుండ్రి.

మీరు …. నాలకేసి బగ్గ రాక్కున్నా తెలంగాణా ప్రజలు ఒప్పుకోకుండా

ఇగ సమైక్యత సాద్యంకాదంటె కాదు.

అనవసరంగ, అన్యాలంగ అమాయకులను ఎందుకురా హరగోసపెడ్తరు?

 

Posted in Telangana | 4 Comments

రామాయణమంత విన్నాక రాముడికి సీత ఏమవుతుంది? అని అనుమానం వచ్చినట్టు ఇన్ని ఉద్యమాలు జరిగాక ఇప్పుడు ”సమైక్యత” అంటే ఏమిటి? ”జై సమైక్యాంధ్ర” అంటే అర్థమేంటి అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి!

‘రాముడికి సీత ఏమవుతుంది?’ అనే పేరుతో ఆరుద్ర ఓ పుస్తకం రాశారు.

ఒక్క వాల్మీకి రామాయణమే కాకుండా ప్రపంచంలో ఇంకా అనేక రామాయణాలున్నాయని ఆయన సోదాహరణగా వివరించారు. అలాంటి ఒక రామాయణంలో రాముడికి సీత చెల్లెలైతే, మరొక రామాయణంలో సీత రాముడికి కూతురని చెప్పుకొచ్చారు. ఆనాటి సాహిత్యం మౌఖికమైనది కావడం వల్లా, అనేక ప్రక్షిప్తాల వల్లా ఎల్లలు దాటినా కొద్దీ కథ రకరకాలుగా మలుపులు తిరుగుతూ వచ్చింది.

ఇది అలా పక్కన పెడితే…

ఇప్పుడు ఇన్నాళ్ల ఉద్యమాలను చూసిన తరువాత ” రాముడు- సీత ” విషయంలో లాగే

అసలు సమైక్యత అంటే ఏమిటి? జై సమైక్యాంధ్ర అంటే అర్థమేమిటి? ఎవరిది నిజమైన నిస్వార్థమైన నికార్సయిన సమైక్యవాదం? ఒక పార్టీకి చెందిన సమైక్యవాది ఇంకో పార్టీకి చెందిన సమైక్యవాదిని ఎందుకు అనుమానిస్తున్నాడు?

ఎందుకు వాళ్లు ఆగర్భ శత్రువుల్లా ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకుంటున్నారు? అసలు ఏం జరిగింది?
ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది?

ఎవరితో ఎవరు సమైక్యంగా వుండాలనుకుంటున్నారు? ఎవర్ని ఎవరు దుంపనాశనం చేయాలనుకుంటున్నారు? భారత చిత్రపటంలో రెండు భూభాగాలను కలిపి చిత్రించడమేనా సమైక్యత అంటే? ఆ చిత్రపటంలో రెండు రాష్ట్రాలను వేరువేరుగా చిత్రించినంత మాత్రాన అక్కడి ఇక్కడి ప్రజలు ఆగర్భ శత్రువుల్లా మారిపోతారా? భూమి బద్దలవుతుందా?

మరి సమైక్యాంధ్ర అని నినదించేవాళ్లే సమైక్యంగా వుండటంలేదే? ఒక్క ప్రాంతంలో ఒకే నినాదం ఉచ్ఛరించేవాళ్లే తన్నుకుంటున్నారే? మరి వేరే ప్రాంతం వాళ్లతో సఖ్యంగా ఎలా వుండగలుగుతారు?

సమైక్యత అంటే తెలంగాణా మీద సీమాంధ్ర పెత్తనం మూడు పూవులు ఆరు కాయలుగా సాగడమేనా?

తెలంగాణా ప్రజల ఇష్టా అయిష్టాలతో నిమిత్తంలేదా?

తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ,శాశ్వతంగా  వారిని సమైక్య పాలన కింద పడివుండేలా చేయడం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యమేనా?

ఒకప్పుడు 1956 కంటే ముందు ఆంధ్ర- తెలంగాణా (హైదరాబాదు అనాలేమొ) రాష్ట్రాలు వేరువేరుగా వుండలేదా? ఇప్పుడెందుకు వుండలేవు.

ఒక తెలుగు వాడు పోయి కోట్లు వెచ్చించి బెంగుళూరులో నిజాం పాలెస్‌ లాంటి భవనాలు నిర్మించుకోలేదా? వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టలేదా? హైదరాబాద్‌లో పెట్టిన పెట్టుబడులు ఎక్కడికి పోతాయి?

రాష్ట్ర విభజన అంటే దేశ విభజన కాదు కదా?

రాజాజీ రాజకీయ నాయకులను మద్రాసు నుంచి మెడబట్టి గెంటేశాడు తప్ప ఇతర ఆంధ్రులనెవర్నీ ఏమీ అనలేదు కదా.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్ల తరువాత కూడా అక్కడ లక్షల సంఖ్యలో ఆంధ్రులు శుభ్రంగా వుండటంలేదా?

ఇప్పుడు ఇక్కడే ఏం కొంపలంటుకుంటాయి?

మొన్నటి వరకూ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ పార్టీ తెలంగాణాకు అనుకూలమనే చెప్పాయి కదా? కాంగ్రెస్‌ కూడా తెలంగాణా ఇస్తాననే హామీతోనే టిఆర్‌ఎస్‌తో పెట్టుకుని ఒకసారి, పెట్టుకోకుండా అనేకసార్లు తెలంగాణాపై వాగ్దానాలు చేసింది కదా.?

ఇన్నాళ్లకి ఇంత ఆలస్యంగా అందరు ఆమొదించిన నిర్ణయానికి ఓకే చెప్పగానే ఈ యూటర్నులేమిటి? ఈ ఉద్యమ టర్నులేమిటి? ఈ దీక్షా టర్నులేమిటి?

యావద్దేశం తెలంగాణాపై నిర్ణయం తీసుకుందని అది తిరుగులేని నిర్ణయమని తెలిసి కూడా ఇంకా ఈ గొడవలెందుకు?

వీటి వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అదేదో సినిమాలో ”కుక్క కావాలి… కుక్క కావాలి” అని ఒక పిల్లవాడు మంకు పట్టు పట్టినట్టు విజ్ఞులైనవాళ్లు, అన్నీ తెలిసినవాళ్లు కూడా ఉద్దేశపూర్వకంగా మొండిగా మారాం చేయడం మంచిదేనా?

ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు….

వీటికి సమాధానాలు చెప్పే మేధావులే లేరా?

మొన్నటి వరకు ఆంధ్రా వాళ్లను ఉత్తరాదిన ”మద్రాసీలు” అనే పరిగణించేవారు.

ఇక ఇప్పటి నుంచీ ఏమని ….. సంబోధిస్తారో!!

Image

Emira Balaraju

Posted in Telangana | Tagged , , | 8 Comments

నిన్నటి వరకు:”తెలంగాణా వస్తుందంటారా?” ఇవాళ్టి నుంచి: ”సమైక్యాంధ్ర మళ్లీ సాధ్యమేనంటారా?

నిన్నటి వరకు:”తెలంగాణా వస్తుందంటారా?” ఇవాళ్టి నుంచి: ”సమైక్యాంధ్ర మళ్లీ సాధ్యమేనంటారా?

ఓడలు బళ్లవుతాయి…
బళ్లు ఓడలవుతాయి… అంటే ఇదే మరి!

నిన్నటి వరకు ”తెలంగాణా వస్తుందంటారా” అన్న ప్రశ్న వినిపించేంది.
అంతకంటే గట్టిగా ”రాదు గాక రాదు” అన్న సమాధానం ప్రతిధ్వనించేది.

కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు ”సమైక్యాంధ్ర మళ్లీ సాధ్యమవుతుందంటారా, మంత్రివర్గ తీర్మానం వెనక్కిపోతుందంటారా?”
అన్న ప్రశ్నలు … వాటితోపాటు ”అబ్బే అది జరుగనిపని” అన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.

ఎంత మార్పు!
ఒక్కసారిగా పరిస్థితి ఇలా ఎలా మారిపోయింది?

గాంధీలేని మరో స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా 60 రోజులు అంగరంగ వైభోగంగా, నభూతో నభవిష్యతి అన్న చందాన జరిగిన సకల సీమాంధ్ర జనుల సమ్మె ఇలా ఎలా నిష్ఫలమయింది?

ఆరుకోట్ల మందిని కాదని నాలుగు కోట్లమందిని…
175 మంది ఎంఎల్‌ఎలను కాదని 119 మంది ఎంఎల్‌ఎలని…
మెజారిటీని కాదని మైనారిటీని విజయం ఎలా వరించింది?
అసంభవం అనుకున్నది సంభవమెట్లయింది?

హైదరాబాద్‌ అసెంబ్లీ తీర్మానం లేపోయినా, మొదటి ఎస్‌ఆర్‌సి తక్షణ విలీనాన్ని వ్యతిరేకించినా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపేవిధంగా నెహ్రూ అంతటివాణ్ని ఒప్పించిన సీమాంధ్ర లాబీయింగ్‌ మాస్టర్లు ఇప్పుడెందుకు విఫలురయ్యారు?

పది ఛానళ్లు స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ని తలదన్నే విధంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చిత్రించి 24 గంటలు ప్రసారం చేసినా, పది పత్రికలు తెలంగాణ వార్తల్ని తొక్కిపెట్టి మొత్తం పేపర్‌నిండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వేనోళ్ల కీర్తించినా నిష్‌ప్రయోజనమెందుకయింది?

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?
బలవంతులు దుర్బల జాతిని బానిసల గావించారు అందురు గానీ
దుర్బలురైన తెలంగాణా వారు బలవంతులైన సీమాంధ్రులను ఎలా పరాజితుల్ని చేయగలిగారు?

”సిడబ్ల్యుసి తీర్మానం శిలాశాసనం కాద”న్న సింహగర్జనలేమైపోయాయి?

టీడీపీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చి వుండవచ్చు
కానీ ఇప్పుడు సమైక్యాంధ్రకోసం భాహాటంగా పార్లమెంటులో పోరాడుతోంది కదా…
వైఎస్‌ఆర్‌పార్టీ సమన్యాయం పాటించి తెలంగాణా విభజించవచ్చని చెప్పినా

ఆ తరువాత సమైక్యాంధ్ర తప్ప మరొకటి వద్దని స్పష్టంగా ప్రకటించి రంగంలో దిగింది కదా…
తెలంగాణాపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి వుంటాం అని ప్రకటించిన సిఎం సైతం సమైక్యాంధ్ర తిరుగుబాటు జెండాను ఎగరేశాడు కదా..
ఇంత మంది యు టర్న్‌ తీసుకున్నా అధిష్టానం ఎందుకు యూ టర్న్‌ తీసుకోకుండా ముందుకే వెళ్లింది?

మెజారిటీ సీమాంధ్ర ప్రజల్ని కాదని మైనారిటీ తెలంగాణా ప్రజల పక్షం ఎందుకు వహించింది??
ఎందుకు? ఎందుకు?? ఎందుకు???

ఎందుకంటే ఇంకా న్యాయం ఒక్కపాదంతోనైనా నడుస్తోంది కాబట్టి!
మన దేశంలో ధర్మం ఇంకా కొన ఊపిరితోనైనా బతికివుంది కాబట్టి!!

కాదంటారా?

Image

Posted in Telangana | 15 Comments

”మనం సమ్మె చేసినంతకాలం తెలంగాణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ! కాబట్టి మన సమ్మెను శాశ్వతంగా కొనసాగిస్తూనే వుండాలి !! “

”మనం సమ్మె చేసినంతకాలం తెలంగాణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ! కాబట్టి మన సమ్మెను శాశ్వతంగా కొనసాగిస్తూనే వుండాలి !! ”

సోదర సోదరీమణులారా!

తెలంగాణాపై సిడబ్ల్యుసి తీర్మానం చేసి రెండు నెలలు అవుతున్నా
మన సమ్మె దెబ్బకు కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది.
మనం సమ్మెను కొనసాగించినంతకాలం ఇదే పరిస్థితి వుంటుంది.
సమ్మె ఆపితే వెంటనే తెలంగాణాను డిక్లేర్‌ చేస్తారు.

కాబట్టి
సమ్మెను వీరోచితంగా కొనసాగిస్తూనే వుండండి.
ముష్టి జీతాలకోసం భావి జీవితాలను బలిపెట్టవద్దు.

మన సమ్మె వల్ల మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నట్టు నటించే కొద్ది మంది బీద పిల్లలకు తాత్కాలిక నష్టం జరగొచ్చు.

మన సమ్మె వల్ల కంట్రోల్‌ షాపుల్లో రూపాయకి కిలో బియ్యంపై ఆధారపడి బతికే దారిద్య్రరేఖకు దిగువన వున్న కొద్దిమంది ప్రజలకు స్వల్ప నష్టం జరగొచ్చు.

మన సమ్మె వల్ల రెండు వందల రూపాయల పెన్షన్‌తో బతుకు ఈడుస్తున్న కొద్ది మంది కాటికి కాళ్లు చాపుకుని కూచున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నష్టం జరుగవచ్చు.

మన సమ్మె వల్ల ఆర్టీసీ బస్సుల్లో తక్కువ చార్జీలతో ప్రయాణంచేయడానికి అలవాటుపడ్డ కొంతమంది మధ్యతరగతి జనానికి ఇబ్బంది కలగవచ్చు.
అంతే
అంతకు మించి మరెవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ కలగదు.

ఇక మన సమ్మె వల్ల కలిగే లాభాలు చెప్పాల్సి వస్తే భోలెడున్నాయి.
మనవాళ్లు హైదరాబాదులో సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తికి భద్రత కలుగుతుంది.
తెలంగాణాలో మనవాళ్ల వేలాది ఉద్యోగాలకు భద్రత లభిస్తుంది.
గోదావరి, కృష్ణమ్మ నీళ్లను మనం యధేచ్ఛగా మన ప్రాంతానికి మళ్లించుకుంటూనే వుండవచ్చు.
ఇన్ని లాభాల ముందు మనం సమ్మె వల్ల కోల్పోతున్నది  ఏపాటి.

కానీ. పొరపాటున గనక
తెలంగాణా ఇచ్చేస్తే ….

మనం అడుక్కు తినాల్సి వస్తుంది.
మన పిల్లలకు ఉద్యోగాలు రావు.
మనకు తెలంగాణా నిధులు రావు.
మనకు నీళ్లు రావు. మన పొలాలన్నీ ఎండి బీడుపడిపోతాయి.
మనకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడుతుంది.

తెలంగాణ మన నిధి.
తెలంగాణ మన పెన్నిధి.
తెలంగాణ మన సన్నిధి.
తెలుగు తల్లి కరుణాకటాక్షం వల్ల మనకు లభించిన ఒక అపూర్వ అక్షయ పాత్ర, ఒక బంగారు గని తెలంగాణ !

తెలంగాణా లేకపోతే మనకు మనుగడ లేదు.
తెలంగాణ లేకపోతే మనం గడ్డి తిని బతకవలసి వస్తుంది.
తెలంగాణ లేకపోతే మనం కోడి ఈకలు తిని బతకవలసి వస్తుంది.
తెలంగాణా లేకపోతే మనం అడుక్కు తిని బతకవలసి వస్తుంది.
తెలంగాణా లేకపోతే మనం వస్త్రాలకు బదులు ఆకులు అలములు నడుముకు చుట్టుకోవలసి వస్తుంది.
తెలంగాణా లేకపోతే మనకు మరణమే శరణము.

కాబట్టి
సమ్మెను ఎట్టి పరిస్థితిలోనూ విరమించవద్దు.
సమ్మెను విరమించామో తెలంగాణా డిక్లేర్‌ అయిపోతుంది.
అప్పుడు తెలంగాణాకు వెళ్లాలంటే పాస్‌పోర్టు వీసాలు తీసుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది.
హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో మారిపోతుంది.
అక్కడ మనం ద్వితీయశ్రేణి పౌరులమైపోతాం.

తెలంగాణా వారి పెత్తనం కింద తలవంచుకుని గడపవలసి వస్తుంది. మనం అక్రమంగా
సంపాదించుకున్న భూములన్నింటినీ వాళ్లు తిరిగి స్వాధీనం చేసేసుకుంటారు.
తస్మాత్‌ జాగ్రత్త… జాగ్రత్త…జాగ్రత్త….!

మనం ఒప్పుకోకుండా,
మన అసెంబ్లీ తీర్మానం చేయకుండా తెలంగాణ ఎప్పటికీ ఏర్పడదు.

మనవి పదమూడు జిల్లాలు వాళ్లవి పది జిల్లాలే.
మనం ఆరుకోట్లు వాళ్లు నాలుగుకోట్లే.
మన ఎంఎల్‌ఏలు 175 మంది అయితే వాళ్ల ఎంఎల్‌ఏలు 119 మందే.
మన చేతిలో పది టీవీ చానళ్లు, పది పత్రికలు వుంటే
వాళ్ల చేతిలో ఇంకా బాల్యారిష్టాలు దాటని ఒక్క చానలు, ఒక్క పత్రిక మాత్రమే వున్నాయి

వేల కోట్ల కు పడగలెత్తిన మన పెట్టుబడిదార్లు యాభైమంది వుంటే
వాళ్లకు ఒక్కడు కూడా లేదు.

మనకు నిధుల కొరతలేదు.
అర్థ బలం, అంగ బలం, అధికార బలం, లాబీయింగ్‌ బలం అన్నీ పుష్కలంగా వున్నాయి.

వాళ్ల దగ్గర న్యాయం, పోరాట పటిమ, జానపద పాటలు తప్ప మరేమీ లేవు.

మన రాష్ట్రం సమైక్యంగా వుండాలంటే తెలంగాణా ప్రజల అంగీకారం అవసరం లేదు.
విడిపోవాలంటే మాత్రం మన అంగీకారం తప్పనిసరిగా కావాలి.
వాళ్లు ఎంత గింజుకున్నా మన నుంచి వేరు కాలేరు.
వాళ్ల నేతలు ఎందరో మన చెప్పు చేతల్లో వున్నారు.
మన అడుగులకు మడుగులొత్తేందుకు సిద్ధంగా వున్నారు.

కాబట్టి తెలంగాణా ప్రజలు మహా అయితే మరో వెయ్యి మంది ఆత్మబలిదానాలు చేసుకోగలరేమో కానీ
మన నుంచి… మన ధృతరాష్ట్ర కౌగిలి నుంచి … ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోలేరు .

కానీ మన దురదృష్టం ఏమిటంటే…
మన వాళ్ల ఏమరుపాటునో, పొరపాటునో, గ్రహపాటునోగానీ
సిడబ్ల్యుసి తీర్మానం చేసేసింది.
యుపీఏ మిత్రపక్షాలన్నీ తెలంగాణా తీర్మానంపై ఆమోదముద్ర వేశాయి.

కాబట్టి
మనం సమ్మె విరమించామో తెలంగాణా డిక్లేర్‌ అయ్యే ప్రమాదం వుంది.

అందుకే మనం  మన సమ్మెను
ఎన్ని రోజులైనా,
ఎన్ని నెలలైనా,
ఎన్ని సంవత్సరాలైనా
అప్రతిహంగా కొనసాగించాలని మనవిచేస్తున్నాను.

జా……య్‌……చ మైఖ్యాంధ్ర!

Image

Image

Gaddi Tinaalsi vastundataMadaakabalam Telugu TalleeMoorkhasHijra Samaikyandhra

Posted in Telangana | 10 Comments

పూల మొక్కలు విడిపోదామంటున్నయ్‌…! కలుపు మొక్కలు కలిసుందామంటున్నయ్‌…!!

పూల మొక్కలు విడిపోదామంటున్నయ్‌…! కలుపు మొక్కలు కలిసుందామంటున్నయ్‌…!!

అది యొక ఉద్యానవనము.
అందు అనేక పూల మొక్కలున్నవి.
ఎందరో తోటమాలులు కూడా వున్నారు.
కానీ వారు స్వార్థపరులు, సోమరిపోతులు.
పూలమొక్కల సంరక్షణను పట్టించుకొనెడివారుకాదు.

అయినను ఆ పూలమొక్కలు
తమ అస్తిత్వమును కాపాడుకొనుచు ప్రకృతిని శోభిల్లజేయుచుండెడివి.
ఇది ఇటులుండ
ఆ వనములోకి కొన్ని కలుపు మొక్కలు వలస వచ్చినవి.

“మీరూ మొక్కలే…
మేమూ మొక్కలమే…
మన దంతా ఒకే జాతి
మన దంతా ఒకే భాష
మన మంతా కలిసుందాం
కలిసి వుంటే కలదు సుఖం
విడిగా వుంటే అంతా దుఖం”

అంటూ సమైక్య గీతాలాలపించి,
సవాలక్ష వాగ్దానములతో మైమరపించి,
అరచేతిలో వైకుంఠము చూపించి
ఆ వనమునందు తిష్టవేసినవి.

కాలక్రమమున
ఆ కలుపు మొక్కలు వనమెల్లా విస్తరించినవి.
ఇప్పుడు ఆ వనములో పూల మొక్కల జాడ కనిపించనంతగా
కలుపు మొక్కలు తాడిచెట్టంత ఎత్తున ఏపుగా పెరిగినవి.

ఆ పూలమొక్కలకు ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరి అయ్యే దుర్భరస్థితి ఏర్పడినది.
అందువలన
” మీతో మేం కలిసుండలేం మనం విడిపోతాం
మీ మానాన మీరు బతకండి
మా మానాన మేము బతుకుతాం ” అనడం మొదలుపెట్టినవి.

కలుపు మొక్కలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నవి.
విభజన వద్దు సమైక్యత ముద్దు అని రణన్నినాదాలు చేస్తున్నవి.

“మేము రాకముందు ఈ వనము ఎట్లుండెడిది
నీరు పోసే నాధుడు లేక ఎండిపోయినట్టుండెది కదా.
మేము వచ్చిన తరువాతనే ….
మేము ఏపుగా పెరిగిన తరువాతనే…
మేమంతా తెగ బలిసిన తరువాతనే ….
ఈ వనం నేడు పచ్చదనముతో కళకళ లాడుతున్నది.
ఇప్పుడు మమ్ము ఈ అభివృద్ధి చెందిన వనమును వదలి వెళ్లిపొమ్మనుట
జాగో భాగో అనుట దుర్మార్గము కదా ” అంటున్నవి.

“విడిపోవాలని మీకు అంత ఉబలాటముగా వున్న యెడల
ఈ వనమును మాకు వదిలి…

మీరే మరొక వనమును చూసుకొనుడు ” అని ఘీంకరిస్తున్నవి.

మానవత్వమున్న మేధావులారా!
ధర్మాధర్మ విచక్షణ వున్న మానవులారా!!
ఎవరిది న్యాయమో తీర్పు మీరే చెప్పుడి.

(డా. రాళ్లబండి కవితా ప్రసాద్‌ గారు రాసిన కవిత స్ఫూర్తితో)

Image

Posted in Telangana | Tagged , , , | 14 Comments

కాకి పిల్ల కాకికి ముద్దు … ఎవరి ఉద్యమాలు వారికి ముద్దు …!

కాకి పిల్ల కాకికి ముద్దు … ఎవరి ఉద్యమాలు వారికి ముద్దు …!

కాకి తల్లి …తన పిల్లపై ముద్దు మురిపెములు కురిపిస్తూ
”కోకిల పిల్లను” పొడిచి పొడిచి హింసించునట.
ఎందులకు?

కోకిల పిల్ల కాకి పిల్ల వలె ”కావు కావు ” మనకుండా…
”కుహూ కుహూ..” మనుట అది సహించజాలదు కనుక.

ఉప్పు కప్పురంబు లొక్క పోలిక నుండునటుల
కాకి-కోకిలలు రెండును నొకేరకముగ నల్లగ నిగనగలాడుచుండును.
కానీ వాటి పలుకులు వేరు.
అందువలననే అవి ఒకే గూటిలో మనజాలవు.

మనకు కోకిల రావం వీనుల విందుగ అనిపించును
కానీ కాకికి కోకిల కూత దుర్భరముగ వినిపించును.
కాకికి ”కావు కావులే” మధురాతి మధురముగ నుండును.
అందులకే ”కాకి పిల్ల కాకికి ముద్దు” అను లోకోక్తి వచ్చినది.

ఈ కాకిగోల మన కేల.
ఇప్పుడు మన ముందున్న గోల వేరు కదా.

ఉద్యమములు కూడా రెండు రకములు.
కాకి కోకిలల వలె ఆ రెండు రకముల ఉద్యమములు పైకి ఒకే రకముగ కనిపించును.
అవి రెండూ ఒకే రకముగ ఉవ్వెత్తున ఎగసి పడుచుండును.
కానీ చూడ చూడ రుచుల జాడ వేరు.

ఒక రకం ఉద్యమం ”మాది మాకు కావాలె” అని నినదిస్తే
రెండో రకం ఉద్యమం ”మాది మాకే కావాలి. మీది కూడా మాకే కావాలి” అని నినదించును.

ఒక రకం ఉద్యమం ”మా నీళ్లు మాకు కావాలి. మా ఉద్యోగాలు మాకు కావాలి. మా నిధులు మాకు దక్కాలి” అంటుంది.
రెండో రకం ఉద్యమం ”మీ నీళ్లు , మీ ఉద్యోగాలూ,  మీ నిధులూ మాకే కావాలి. మీ నీళ్లు లేకపోతే మా
ప్రాంతం ఎడారి అవుతుంది. మీ ఉద్యోగాలు లేకపోతే మా పిల్లలు వీధుల్లో అడుక్కు తినవలసి వస్తుంది. మీ నిధులు లేకపోతే మా ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేం”అంటుంది.

ఒక ఉద్యమం స్వాభిమానాన్ని, స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛని, అస్తిత్వాన్ని కోరుకుంటుంది.
రెండో రకం ఉద్యమం మరొక ప్రాంతంపై పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని, దోపిడీని శాశ్వతముగ చెలాయించాలని ఉబలాటపడుతుంది.

ఒక రకం ఉద్యమంపై లాఠీలు విరుగుతాయి, టియర్‌ గ్యాసులు విషం చిమ్మిస్తాయి, రబ్బర్‌ బుల్లెట్లు పేలుతాయి…. ఒక్క సమావేశం పెట్టుకోవాలన్నా వారికి గగనంగా మారుతుంది. అతికష్టం మీద సమావేశానికి అనుమతి ఇచ్చినా ఆరోజు రైళ్లు బస్సులు రద్దు అవుతాయి, ప్రైవేటు లారీలకు ఫర్మానాలు జారీ అవుతాయి.

కానీ రెండో రకం ఉద్యమం పరిస్థితి వేరు.
దానికి ప్రభుత్వ ఆదరణ వుంటుంది .
పెట్టుబడిదారుల అండదండలు దానికి పరిపుష్టి నిస్తాయి.

ఆ పెట్టుబడిదారుల పుత్రికలైన పత్రికలు మరియు
రంగుడబ్బాల మీడియా దానిని వేనోళ్ల కీర్తిస్తుంటాయి.
అట్టి ఉద్యమమునకు భంగము వాటిల్లకుండా రక్షక భటులు భద్రత కల్పిస్తారు.

అంతిమంగా …

ఏ ఉద్యమాన్ని విజయం వరిస్తుంది?
ఏ ఉద్యమాన్ని న్యాయదేవత హర్షిస్తుంది?
ఏ ఉద్యమంలో ధర్మం వుంది?

ఓ సమస్త మహాజనులారా  !

ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడునటుల కాకుండా
న్యాయాన్యాయ విచక్షణతో , నిష్పక్షపాతముతో, ప్రజాస్వామ్య బధ్ధముగ

స్పందించండి !

Image

Madaakabalam Telugu TalleeMoorkhas

Gaddi Tinaalsi vastundataKodi Eekala samaikyandhraHijra SamaikyandhraSmaadhilo Samaikyam

Kotulu Barrelu

Posted in Telangana | 5 Comments